న్యూఢిల్లీ: ఉద్యోగ మార్కెట్‌ను వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి జనరేషన్ జెడ్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మధ్యతరగతి యువత కెరీర్‌కు ఎంతగానో దోహదం చేసే సంప్రదాయ అరంగేట్ర స్థాయి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాలపై ఏఐ పిడుగు వేసింది. ఏఐ వ్యవస్థలు ప్రాథమిక స్థాయి విధులను వేగంగా, మానవ కార్మికుల కంటే తక్కువ ఖర్చుతో చేస్తుండటంతో నవతరానికి ఉద్యోగాలు దొరకడమే సవాల్‌గా మారుతున్నది.
నైపుణ్యాభివృద్ధికి, పని ప్రదేశంలో నలుగురితో కలివిడిగా ఉండే అవకాశానికి, కెరీర్ నెట్వర్కింగ్ లాంటి కీలక అవకాశాలను అందించే సంప్రదాయ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తున్నది. దీంతో యువ ప్రొఫెషనల్స్ తాము ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగడానికి సరైన దారిని ఏర్పరుచుకోలేకపోతున్నారు. మధ్య తరగతి యువతరం ఎక్కువగా ఉద్యోగాలు చేసే అయిదు ప్రధాన రంగాల్లో వారి ఉద్యోగ అవకాశాలను కృత్రిమ మేధ గండికొడుతున్నది.
1.టెక్/సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడింగ్ ఉద్యోగాలు మాయం
సాధారణంగా జూనియర్ డెవలపర్స్ హ్యండిల్ చేసే కోడింగ్ పనులు ఇప్పుడు ఏఐ చక్కబెట్టేస్తున్నది. గిట్‌హబ్, కోపైలట్ కోడ్ జనరేటింగ్ మోడల్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఏఐ టూల్స్ ఇప్పుడు కోడింగ్ పనులను అనుభవం లేని ప్రోగ్రామర్లు చేసే తప్పుల కన్నా తక్కువ తప్పులతో వేగంగా చేస్తున్నాయి. దీంతో కంపెనీలు ఏఐ టూల్స్‌తో కోడింగ్ రాయిస్తున్నాయి.
2.తగ్గుతున్న న్యాయ సేవలు, జూనియర్ రిసెర్చ్, క్లరికల్ సేవలు
ఎవిసోర్ట్, లెక్సిస్నెక్సిస్, కేస్టెక్ట్స్ లాంటి ఏఐ టూల్స్ వల్ల న్యాయ రంగంలోని జూనియర్ ప్రొఫెషనల్స్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దస్ర్తాల సమీక్ష, న్యాయ పరిశోధన, కాంట్రాక్టుల విశ్లేషణ లాంటి పనులను ఏఐ బాగానే చేస్తున్నది. గోల్డ్‌మన్ శాక్స్ అంచనా ప్రకారం 2023 నాటికే 44 శాతం న్యాయ రంగ పనులు ఆటోమేటెడ్ అవుతాయి. దీని ప్రభావం పారా లీగల్, జూనియర్ అసోసియేట్స్ పైన పడింది. ఏఐ ప్రభావం వల్ల జూనియర్ లీగల్ ప్రొఫెషనల్స్‌కు కీలక అభ్యసన అవకాశాలు తప్పిపోతున్నాయి.
3.రిటైల్, కస్టమర్ సర్వీస్‌లో పెరుగుతున్న ‘బాట్స్’ వాడకం
అత్యాధునిక నైపుణ్య డిగ్రీలు లేనివారు రిటైల్, కస్టమర్ సర్వీసుల్లో ఉద్యోగాలు వెతుక్కోవడం పరిపాటే. ఈ ఉద్యోగాలు క్షేత్ర స్థాయిలో వ్యాపార నిర్వహణ అవకాశాలను, ప్రాథమిక పని ప్రదేశ నైపుణ్యాల అభివృద్ధికి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యల పరిష్కార సామర్థ్యాల వృద్ధికి తోడ్పడతాయి. అయితే ఎయిర్‌పోర్టుల్లో స్వీయ తనిఖీ టెర్మినల్స్ లాంటివి పుట్టుకు రావడం ఈ రంగంలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. రొటిన్‌గా ఉండే విచారణలకు ఏఐ చాట్ బాట్స్, ఆటోమెటెడ్ రెస్పాన్స్ సిస్టమ్స్ సమర్థంగా సమధానాలు చెప్తున్నాయి. ప్రాథమిక లావాదేవీలను అవి పూర్తి చేసి క్లిష్టమైన సమస్యలను మానవ రిప్రజెంటేటివ్స్లకు పంపిస్తుండటంతో మొత్తంగా కస్టమర్ సర్వీస్ ఉద్యోగాల అవసరం తగ్గుతున్నది.
4.మార్కెటింగ్, కంటెంట్ క్రియేటింగ్‌లో జూనియర్ స్థానాల ఆక్రమణ
ప్రాథమిక మార్కెటింగ్ మెటీరియల్, గ్రాఫిక్ డిజైన్స్, సోషల్ మీడియా కంటెంట్‌ను ఏఐ టూల్స్ తయారు చేయగలుగుతున్నాయి. దీంతో ఈ రంగంలో జూనియర్-లెవల్ ఉద్యోగుల కొలువులకు ఎసరు వచ్చింది. దీంతో వారికి ప్రత్యక్ష పని అనుభవం, రియల్ క్లయింట్స్, క్యాంపెయిన్ల అనుభవం దక్కడం లేదు.
5.అడ్మినిస్ట్రేటివ్, ఆఫీస్ సపోర్ట్ కొలువుల్లో ఏఐ అరంగేట్రం
ఈ రంగంలోని ఉద్యోగాలు కీలకమైన ‘లాంచ్ ప్యాడ్’ లాంటివి. ఇవి తాజా పట్టభద్రులకు వివిధ పరిశ్రమల్లో ప్రొఫెషనల్ నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే ఏఐ డాటా ఎంట్రీ, షెడ్యూలింగ్, జనరల్ ఆఫీస్ అసిస్టెన్స్ ఆటోమేషన్ లాంటి ఏఐ ఉపకరణాలు మధ్యతరగతి యువతకు అవసరమైన పునాది స్థాయి కెరీర్ అవకాశాలను తొలగిస్తున్నాయి. ఈ రంగంలో మనుషుల కన్నా ఏఐ సమర్థంగా విధులను నిర్వహిస్తుందని చాలా మంది ఉద్యోగులను నియమించుకొనే మేనేజర్లు భావిస్తున్నారని తాజా సర్వే ఒకటి తెలిపింది. కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగులుగా నియమించుకోవడంతో అయ్యే ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఏఐతో పనులు జరిగిపోతుండటమే ఇందుకు కారణం. దీంతో యువ ప్రొఫెషనల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి మెరుగుపరుచుకోలేకపోతున్నారు.