పనాజీ,ఫిబ్రవరి 27: గోవాలో పర్యాటకుల తగ్గిపోవడానికి బీచ్ షాపులలో ఇడ్లీ-సాంబార్ అమ్మడమే కారణమని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో గురువారం వ్యాఖ్యానించారు. గోవా రాష్ర్టాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం తగదని, ఇందుకు సంబంధిత భాగస్వాములందరూ సమానంగా బాధ్యులని చెప్పారు.
ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు తమ బీచ్ దుకాణాలను గోవా ప్రజలు అద్దెకు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన వ్యక్తులు కొందరు తమ షాపులలో వడా-పావ్ అమ్ముతున్నారని, కొందరు ఇడ్లీ-సాంబార్ అమ్ముతున్నారని, ఈ కారణంగానే రెండేళ్లుగా అంతర్జాతీయ పర్యాటకం తగ్గిపోయిందని ఆరోపించారు. యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ పర్యాటకులు గోవాకు రావడం ఆగిపోయిందనిఅన్నారు. పూర్వ యూఎస్ఎస్ఆర్ దేశాల నుంచి పర్యాటకులు గోవాను సందర్శించడం మానుకున్నారని చెప్పారు.