న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న ఆర్మీ హెలిక్యాప్టర్ Mi-17V-5 తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఈ మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ వెంటనే హెలిక్యాప్టర్ నుంచి మంటల చెలరేగాయి. ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్ నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీసినట్లు నీలగిరి జిల్లా కలెక్టర్ తెలిపారు. బిపిన్ రావత్‌కు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన హెలిక్యాప్టర్ ప్రత్యేకతల గురించి చర్చనీయాంశంగా మారింది.
Mi-17V-5 హెలిక్యాప్టర్ Mi-8/17 కుటుంబానికి చెందిన మిలిటరీ రవాణా విమానం. రష్యన్ హెలిక్యాప్టర్స్‌కు చెందిన సబ్సిడరీ అయిన కజాన్ హెలిక్యాప్టర్స్ ఈ హెలిక్యాప్టర్‌ను తయారుచేసింది. ఈ Mi-17V-5 హెలిక్యాప్టర్ ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలిక్యాప్టర్. ఈ హెలిక్యాప్టర్లను భద్రతాబలాగాల రవాణాకు, అగ్నిప్రమాదాల కట్టడితోపాటు కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్ విధుల్లో, గాలింపు, రక్షణ ఆపరేషన్లలో వినియోగిస్తున్నారు.
ఈ Mi-17V-5 హెలిక్యాప్టర్ల కోసం 2013 ఫిబ్రవరిలో రక్షణ శాఖ తొలి ఆర్డర్ చేసింది. ఫిబ్రవరిలో ఎరో ఇండియా ఎయిర్ షో సందర్భంగా మొత్తం 12 హెలిక్యాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చింది. రష్యన్ హెలిక్యాప్టర్స్ నుంచి మొత్తం 80 హెలిక్యాప్టర్ల కొనుగోలు కోసం భారత రక్షణ శాఖ 2008 డిసెంబర్లో 1.3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. రష్యన్ హెలిక్యాప్టర్స్ 2011 నుంచి హెలిక్యాప్టర్లను డెలివరీ చేయడం మొదలుపెట్టింది.
2013 ప్రారంభం వరకు మొత్తం 36 హెలిక్యాప్టర్లను డెలివరీ చేసింది. 2012, 2013 మధ్యకాలంలో 71 Mi-17V-5 హెలిక్యాప్టర్ల కోసం భారత రక్షణ శాఖ, రొసొబరోనెక్స్‌పోర్ట్ మధ్య అంగీకారం కుదింది. ఈ రొసొబరోనెక్స్‌పోర్ట్.. ఆఖరి బ్యాచ్ Mi-17V-5 హెలిక్యాప్టర్లను 2018 జూలైలో డెలివరీ చేసింది. కాగా, ఈ Mi-17V-5 హెలిక్యాప్టర్ల రిపేర్ అండ్ సర్వీసింగ్ సౌకర్యాన్ని భారత వాయుసేన 2019 ఏప్రిల్‌లో ప్రారంభించింది.