న్యూఢిల్లీ: ద లాన్సెట్ జర్నల్ సంచలన నివేదికను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక వైకల్యం( Mental disorders) కేసులు పెరుగుతున్నట్లు ఆ రిపోర్టులో పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. 1990 నుంచి మానసిక రుగ్మతకు చెందిన కేసులు సంఖ్య రెట్టింపు అయినట్లు ద లాన్సెట్ జర్నల్ తన రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న గుండె, క్యాన్సర్, నరాల సంబంధిత కేసుల కన్నా ఎక్కువ సంఖ్యలో మానసిక వైకల్యం కేసులు ఉన్నట్లు ఆ రిపోర్టులో చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్, క్వీన్స్‌ల్యాండ్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ రీసర్చ్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన పరిశోధకులు ఈ రిపోర్టును తయారు చేశారు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 102 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే 1990 నుంచి ఆ సంఖ్య మరింతగా పెరిగినట్లు భావిస్తున్నారు. ఆందోళన, నిరాశతో నిండిన ప్రజల్లో ఎక్కువగా మానసిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ సమస్యకు మరింత ఎక్కువ సంఖ్యలో బలి అవుతున్నట్లు ఆ పరిశోధకులు గుర్తించారు.
పరిశోధకులు తమ గణాంకాల్లో ఎన్నో విషయాలు వెల్లడించారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 62 కోట్ల మంది మహిళలు మానసిక సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఇక ఆ ఏడాదిలోనే పురుషుల సంఖ్య 55.2 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య సుమారు 17 శాతం ఉంటుందని పరిశోధకులు భావించారు. స్త్రీ, పురుషుల్లో వయసు రీత్యా ఆందోళన చెందుతున్న వారి సంఖ్య 1990లో లక్ష మందికి 2592 కాగా, ఆ బాధితుల సంఖ్య 2023లో లక్ష మందికి 5793 కాగా నమోదు అయ్యింది. 1990 నుంచి 2023 నాటితో పోలిస్తే మహిళల్లో మానసిక రుగ్మత కేసుల్లో సుమారు 136 శాతం పెరుగుదల కనిపించింది. ఇక పురుషుల్లో ఆ సంఖ్య 102గా ఉంది. పేదరికం, అభద్రత, వేధింపులు, హింస, సమాజానికి దూరం, కోవిడ్ పరిస్థితులు లాంటి దీర్ఘకాల సమస్య వల్ల మానసిక రుగ్మత కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు క్వీన్స్లాండ్ మెంటల్ హెల్త్ రీసర్చ్ ప్రొఫెసర్ డామియన్ శాంటమారో తెలిపారు. మానసిక ఆరోగ్య అంశాల్లో అనేక సవాళ్లు ఉత్పన్నం అవుతున్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, కేరింగ్ పెరగాలని, ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం మని శాంటమారో చెప్పారు.
12 రకాల మెంటల్ డిజార్డర్స్‌ను పరిశోధకులు పరిశీలించారు. ఆందోళన, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, షిజోఫ్రేనియా, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఏడీహెచ్‌డీ, ఈటింగ్ డిజార్డర్స్‌ను అంచనా వేశారు. అయితే రోజు రోజుకూ ఈ సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా దిగువ, మధ్య తరగతి దేశాల్లో మరింత ఎక్కువ ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. 2023లో మహిళల్లో ఎక్కువగా ఆందోళన, డిప్రెషన్ కేసులు నమోదు అయ్యాయి. ఇక పురుషుల్లో ఎక్కువగా ఏడీహెచ్‌డీ(అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్), కండక్ట్ డిజార్డర్, ఆటిజం కేసులు నమోదు అయ్యాయి.