లక్నో: ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి, మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అనుమానాస్పదంగా మరణించాడు. (Medical Student Dead) హాస్టల్ బిల్డింగ్ వెనుక అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోరఖ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల కుషాగ్ర ప్రతాప్ సింగ్, షాజహాన్‌పూర్ జిల్లాలోని వరుణ్ అర్జున్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం క్యాంపస్‌లో అనుమానాస్పదంగా అతడు మరణించాడు. హాస్టల్ బిల్డింగ్ వెనుక కుషాగ్ర ప్రతాప్ సింగ్ మృతదేహం పడి ఉంది. ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు ఆ మెడికల్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. మెడికల్ స్టూడెంట్ కుషాగ్ర ప్రతాప్ సింగ్ మృతదేహాన్ని పరిశీలించారు. ఆ హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని రూమ్‌లో అతడు ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మూడంతస్తుల ఆ భవనంపై నుంచి తనంతగా పడిపోవడం లేదా ఎవరైనా అతడ్ని తోసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్య విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.