బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ పదానికి అర్థం వల్గర్ అని అన్నారు. పర్షియన్ పదమైన హిందూతో భారత్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. బెళగావి జిల్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సతీష్ లక్ష్మణరావు జార్కిహోళి మాట్లాడారు. ‘హిందూ’ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందన్నారు. అలాగే ఆ పదానికి మూలాలు భారతదేశంలో లేవని చెప్పారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్ నుంచి వచ్చిందని తెలిపారు. ‘హిందూ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? అది మనదేనా?’ అని ప్రశ్నించారు. ‘ఇది పర్షియన్, ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతానికి చెందినది. హిందూ అనే పదానికి భారత్తో సంబంధం ఏమిటి? మీరు దానిని ఎలా అంగీకరిస్తారు? దీనిపై చర్చ జరుగాలి’ అని అన్నారు.
అంతేగాక ‘హిందూ అనే పదానికి అర్థం తెలిస్తే మీరు సిగ్గుపడతారు. దీని అర్థం అసభ్యకరం’ అని జార్కిహోళి వ్యాఖ్యానించారు. హిందూ పదం ఎక్కడ నుంచి వచ్చిందో అన్నది వికీపీడియా ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు.
మరోవైపు హిందూ పదంపై జార్కిహోళి మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై మండిపడింది. ఇది హిందువులను అవమానించడం, రెచ్చగొట్టడం అని ఆ పార్టీ ఆరోపించింది.