న్యూఢిల్లీ: షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీరులో(పీవోకే) మళ్లీ నిరసనలు మిన్నంటాయి. అయితే ఈసారి ఆందోళనకు సారథ్యం వహిస్తున్నది మాత్రం జెన్-జీ. విద్యారంగంలో సంస్కరణల కోసం డిమాండు చేస్తూ పీవోకే విద్యార్థులు నిరసన బాటపట్టారు.
పరీక్ష ఫీజుల పెంపు, వాల్యుయేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. విద్యార్థుల నిరసనలు శాంతియుతంగా జరిగినప్పటికీ ముజఫరాబాద్‌లో ఓ గుర్తుతెలియని సాయుధ వ్యక్తి విద్యార్థులపై కాల్పులు జరిపిన దరిమిలా నిరసన హింసాత్మకంగా మారింది. కాల్పులలో ఓ విద్యార్థి గాయపడడంతో ఆగ్రహోదగ్రులైన విద్యార్థులు టైర్లను తగలబెట్టి విధ్వంసకాండకు పాల్పడ్డారు.