న్యూఢిల్లీ, జూన్ 23: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు సంబంధించిన భారీ భూ కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. గత రెండేండ్లలో ఉజ్జయిని, దాని పరిసర ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు, వారికి సంబంధించిన కంపెనీలు 137 ప్లాట్ల ద్వారా కనీసం 168 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. సుమారు రూ. 45 కోట్ల విలువైన ఈ కొనుగోళ్లలో తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగమైన గ్రామాలు, ప్రదేశాలు, కొత్త రోడ్లు, హైవే అలైన్మెంట్లు, ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035 కింద ప్రతిపాదించిన మార్పులు వంటివి ఉన్నాయని పత్రిక కథనం పేర్కొన్నది. ఈ మాస్టర్ ప్లాన్ 2023 మేలో విడుదలైంది. ఈ అక్రమ భూ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాత్రమే కాకుండా ఆయన భార్య సీమా యాదవ్, కుమారుడు వైభవ్ యాదవ్, కోడలు షాలినీ యాదవ్, సోదరులు నారాయణ్, నంద్లాల్ యాదవ్, సోదరి కళావతి యాదవ్, మేనల్లుడు అభయ్ యాదవ్, అలాగే దగ్గరి బంధువులైన గోవింద్, నీలేష్ యాదవ్‌లతో కూడిన పెద్ద బంధువర్గం కూడా భాగమై ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఉజ్జయినిలో కనీసం 17 ఎకరాల భూమిని కలిగి ఉన్నారు. ఇందులో 1998లో సవారఖేడిలో కొనుగోలు చేసిన 13 ఎకరాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆయన, ఆయన భార్య, తమ కుటుంబానికి చెందిన శ్రీ సిద్ధివినాయక్ దేవ్కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలో 73% వాటాను కలిగి ఉన్నట్లు వార్తా కథనం పేర్కొన్నది. ఈ సంస్థ వద్ద కూడా దాదాపు 40 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2024-25లో కొత్తగా కొనుగోలు చేసిన భూమి కూడా కలిపి ఉంది.
కుటుంబ స్పందన
భూ కుంభకోణం ఆరోపణలపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేరుగా స్పందించనప్పటికీ ఆయన కజిన్ గోవింద్ యాదవ్ కుమారుడు అనంత్ యాదవ్ స్పందిస్తూ తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సమర్థించుకున్నారు. 2010 నుంచి తాము రియల్టీ వ్యాపారంలో ఉన్నామని, తమ తండ్రికి, మోహన్ యాదవ్‌కు అనేక హౌసింగ్ ప్రాజెక్టులు, కంపెనీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రైవేట్ భూములను కొనడం, అమ్మడం తమ హక్కని, ముఖ్యమంత్రి తమ కుటుంబ సభ్యుడైనంత మాత్రాన తాము తమ వ్యాపారాన్ని మూసుకోలేమని ఆయన చెప్పారు.
ఇది దోపిడీ ఇంజిన్ సర్కార్: కాంగ్రెస్
ఉజ్జయినిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం పొందే ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబం ఎకరాల కొద్దీ భూమిని కొనుగోలు చేసిందని వచ్చిన వార్తా కథనంపై కాంగ్రెస్ మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం హయాంలో దోపిడీ ఇంజిన్ పూర్తి వేగంతో సాగుతున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా తానే ఈ లూటీలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎక్స్ పోస్టులో ఆరోపించారు. మధ్యప్రదేశ్ నుండి కేంద్రానికి వెళ్లిన వ్యవసాయ మంత్రే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రచారమయ్యేలా చేశారని చర్చ కూడా జరుగుతున్నది అని శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి ప్రస్తావిస్తూ రమేశ్ పేర్కొన్నారు. అధికార పీఠం, లభించే ప్రయోజనాల్లో వాటా కోసమే ఈ అంతర్గత పోరు జరుగుతున్నట్లు కనిపిస్తున్నదని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.