హైదరాబాద్, జూలై 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ కీలకమని, ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సమయాల్లో సాంకేతిక లోపాలు తలెత్తి రన్‌వే నుంచి విమానం జారిపోకుండా ఉండేందుకు చైనా పరిశోధకులు కొత్త రకం మెటీరియల్‌ను అభివృద్ధి చేశారు. అదే ‘మార్ష్‌మాలో కాంక్రీట్’. ఈ మెటీరియల్ స్పాంజీ టైపులో ఉంటూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం వేగాన్ని గరిష్ఠంగా తగ్గించడానికి సాయపడుతుందని చైనా పరిశోధకులు తెలిపారు.
ఎమర్జెన్సీ సమయాల్లో రన్‌వే నుంచి విమానం జారిపోకుండా ఉండేందుకు రన్‌వేకు చివరన కనీసం 90 మీటర్ల పొడవుతో కొంత మట్టిని లేదా గడ్డి మైదానాన్ని విడిచిపెట్టాలని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) నిబంధనలు చెప్తున్నాయి. అయినా, అత్యవసర సమయంలో విమాన వేగాన్ని నిలువరించడం సాధ్యపడట్లేదు.
పైగా ప్రమాదాలు పెరిగిపోయాయి. దీనికి కారణం వర్షకాల సమయాల్లో మట్టి తడిగా మారి విమానం స్కిడ్ అవడం, గడ్డి మైదానాల్లో పశువులు, పక్షులు రావటమే. దీనికి చెక్ పెట్టేందుకు చైనా పరిశోధకులు ఈ మార్ష్‌మాలో కాంక్రీట్‌ను తీసుకొచ్చారు. చైనా వ్యాప్తంగా 14 విమానాశ్రయాల్లో ఈ మెటీరియల్‌ను వాడుతున్నట్టు సమాచారం.