భోపాల్, సెప్టెంబర్ 4: సాగుచేసిన రైతుకు వెల్లుల్లి మంట పుట్టిస్తున్నది. ఉత్పత్తికి పెడుతున్న ఖర్చుకు.. వస్తున్న ఆదాయానికి పొంతన లేక అన్నదాత నష్టాలతో అల్లాడుతున్నాడు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతివ్వాలని వేడుకుంటున్నాడు. ఇదీ మధ్యప్రదేశ్లోని వెల్లుల్లి (ఎల్లిపాయలు ) రైతుల దీనావస్థ. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నది. ఇటు రాష్ట్ర సర్కారు రైతులను ఆదుకోవడం లేదు. దీంతో చేసేదేం లేక బస్తాల కొద్దీ వెల్లుల్లి పంటను రైతులు నదుల్లో పారబోస్తున్నారు. మరికొందరేమో పెట్రోల్ పోసి తగులబెడుతున్నారు.
ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్లో కోకొల్లలు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రైతుల ఆవేదన చూసి నెటిజన్ల కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. గత కొద్ది నెలలుగా మధ్యప్రదేశ్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా చేతికి రావట్లేదని, అలాంటప్పుడు వ్యయ ప్రయాసల కోర్చి మార్కెట్కు పంటను తరలించి అమ్ముకోవడం ఎందుకని రైతులు వాపోతున్నారు.
ఇప్పటికే మూడేండ్లుగా పంట దిగుబడి కాస్త తగ్గగా, మార్కెట్ ధర మరింత తగ్గి మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు అయిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మద్దతు ధర కన్నా ఎంత తక్కువకు మార్కెట్లో అమ్మితే ఆ మొత్తాన్ని రైతులకు అందజేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భవంతర్ భుగటన్ యోజన పేరిట పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ పరిహారం కోసం ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.