Maratha Reservation | జాల్నా, సెప్టెంబర్ 6: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం అవుతున్నది. రిజర్వేషన్లపై తేల్చేందుకు మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ బీజేపీ-షిండే ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. నాలుగు రోజుల్లోగా రిజర్వేషన్లపై ప్రకటన చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం జాల్నా జిల్లాలోని అంతర్వాలి సారథిలోని ఉద్యమం శిబిరంలో తనకు కలిసిన మంత్రులతో కూడిన ప్రభుత్వ బృందానికి జరాంగే ఈ మేరకు స్పష్టం చేశారు.
కాలయాపన కుదరదు..
రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొనేందుకు ప్రభుత్వానికి నెల సమయం ఇవ్వాలని జరాంగేను ప్రభుత్వ బృందం కోరింది. అయితే కాలయాపన కుదరదని, నాలుగు రోజుల్లోగా తేల్చాల్సిందేనని, రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సిందేనని జరాంగే స్పష్టం చేశారు. ఇదే సమయంలో తన నిరాహార దీక్షను విరమించేందుకు కూడా నిరాకరించారు. నాలుగు రోజుల్లోగా సానుకూల నిర్ణయం రాకుంటే తర్వాతి నుంచి నీరు తాగడం ఆపేస్తానని, ఫ్లూయిడ్స్ కూడా తీసుకోనని స్పష్టం చేశారు. కాగా, మనోజ్ జరాంగే ఉద్యమానికి పార్టీలకు అతీతంగా విస్తృత మద్దతు లభిస్తున్నది.
జరాంగేకు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్
జరాంగే నిరాహార దీక్ష బుధవారంతో తొమ్మిదో రోజుకు చేరుకొన్నది. అతనికి డీహైడ్రేషన్ ఉన్నదని, క్రియాటినిన్ లెవల్ కొద్దిగా ఎక్కువగా ఉన్నదని, ప్రస్తుతం ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని జరాంగే ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం పేర్కొన్నది.
ఫడ్నవీస్ రాజీనామా చేయాలి
శివసేన(యూబీటీ) ఎమ్మెల్యేల బృందం బుధవారం గవర్నర్ రమేశ్ బైస్ను కలిసింది. జాల్నాలో ఆందోళకారులపై పోలీసుల లాఠీచార్జి నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి ఫడ్నవీస్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గవర్నర్తో భేటీ అనంతరం ప్రతిపక్ష నేత అంబాదాస్ ధన్వే మాట్లాడుతూ జాల్నా ఘటనపై విచారాలు, క్షమాపణలు సరిపోవని, ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.