న్యూఢిల్లీ: మణిపూర్‌లో రగులుకున్న జాతుల చిచ్చు ఇప్పుడు జమ్ముకశ్మీర్‌కు పాకే పరిస్థితి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్‌లో రెండు తెగల మధ్య రాజుకున్న జ్వాల అమాయకులను దహించి వేస్తున్నది. ఇప్పుడు కశ్మీర్లో కూడా ఉన్నత కులానికి చెందిన పహాడీలు, మరికొందరిని ఎస్టీ జాబితాలో చేర్చడానికి కేంద్రం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గుజ్జర్లు, బకర్వాల్లు ఆందోళనలు ప్రారంభించారు.
ఈ బిల్లును సభలో ఆమోదిస్తే పహాడీలు, గఢ బ్రాహ్మణులు, కొల్లి కులస్తులను ఎస్టీ హోదా వరిస్తుంది. దీని వల్ల రిజర్వేషన్ విధానంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. తద్వారా ఇప్పటికే ఎస్టీ హోదా ఉన్నవారు నిరసనలకు దిగితే మణిపూర్‌లా హింస చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది.