న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఏడేళ్లకుపైగా అధికారంలో ఉన్నా ఇంకా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే ఆ పార్టీ నిందిస్తోందంటూ మండిపడ్డారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతుల ఉద్యమం, విదేశాంగ విధానం, ద్యవ్యోల్బణం, నిరుద్యోగం సహా అనేక అంశాలపై మోదీ ప్రభుత్వం వైఖరిపై మన్మోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు ప్రజలు ద్యవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. తప్పులను అంగీకరించి.. సరిదిద్దుకోవాల్సింది పోయి గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాజీ ప్రధాని నెహ్రూను బాధ్యులను చేయొద్దని సూచించారు.
కాంగ్రెస్ ఎప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించలేదని, నిజాన్ని దాచలేదని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక విధానంపై అవగాహన లేదని మన్మోహన్ సింగ్ విమర్శించారు. విదేశాంగ విధానంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చైనా మన సరిహద్దుల్లో పాగా వేసి అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాజకీయ నాయకులను కౌగిలించుకోవడం, ఆహ్వానం లేకుండా వెళ్లి బిర్యానీ తినడం వల్ల సంబంధాలు మెరుగుపడవని చురకలంటించారు.
బీజేపీ ప్రభుత్వ జాతీయ వాదం బ్రిటీష్ వారి విభజించి.. పాలించు విధానంపై ఆధారపడి ఉందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. కొద్ది రోజుల క్రితం పంజాబ్ పర్యటనలో ప్రధాని భద్రత పేరుతో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీతో పాటు ప్రజల పరువు తీసే ప్రయత్నం చేశారన్నారు. పంజాబీల ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగాలకు ప్రపంచం సెల్యూట్ చేస్తోందని, కానీ ఏన్డీయే ప్రభుత్వం దాని గురించి మాట్లాడడం లేదని మన్మోహన్ అన్నారు. పంజాబ్లో నివసిస్తున్న నిజమైన భారతీయుడిగా.. ఈ విషయాలు తనను బాధించాయని మన్మోహన్ పేర్కొన్నారు.