Manipur | ఇంఫాల్, మే 4: మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ఏటీఎస్‌యూఎమ్) మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. అటు.. పరిస్థితి అదుపు తప్పడంతో సైన్యం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గిరిజనేతరులు ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మణిపూర్ జనాభాలో 40 శాతంగా ఉన్న మైతీ తెగకు ఎస్టీ హోదా కల్పించాలని ఆ రాష్ట్ర హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో 53 శాతం జనాభా కలిగిన ఇతర గిరిజన తెగలు నిరసించాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ఏటీఎస్‌యూఎమ్ 10 పర్వత ప్రాంత జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ ర్యాలీలు’ నిర్వహించింది. ఈ సందర్భంగా సాయుధులైన ఒక గుంపు మైతీ తెగ ప్రజలపై దాడులకు దిగడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. చాలా దుకాణాలు, ఇండ్లు విధ్వంసానికి గురయ్యాయి. మరోవైపు రాజధాని ఇంఫాల్‌లో గిరిజనుల నివాసాలపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పందిస్తూ రెండు వర్గాల ప్రజల మధ్య అపార్థాల వల్ల హింస చోటుచేసుకున్నదన్నారు.
‘విలువైన ప్రాణాలను కోల్పోయాం, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇది దురదృష్టకరం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అదనపు పారా మిలటరీ బలగాలను మణిపూర్‌కు పంపింది. ఇప్పటి వరకు హింసాత్మక ప్రాంతాల నుంచి 9 వేల మంది ప్రజలను సైన్యం రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించింది.
మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆ రాష్ర్టానికి చెందిన ప్రముఖ బాక్సర్, రాజ్యసభ ఎంపీ మేరీ కోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా రాష్ట్రంలో శాంతి స్థాపనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లలో కొందరు ప్రజలు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.