ఇంఫాల్, అక్టోబర్ 2: మణిపూర్ హింసాకాండ ఘటనలకు సంబంధించి అనుమానితుల పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ అక్రమంగా తమ వర్గానికి చెందిన వారిని అరెస్టు చేస్తున్నాయని గిరిజన కుకీ గ్రూపు ఇండిజీనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం(ఐటీఎల్ఎఫ్) ఆరోపించింది. గత 48 గంటల్లో ఇద్దరు మైనర్లతో సహా ఏడుగురిని అరెస్టు చేశారని పేర్కొన్నది. అరెస్టులకు నిరసనగా కుకీ సంఘాలు చురాచంద్పూర్ జిల్లాలో సోమవారం 10 గంటల నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి.
బంద్ ప్రభావంతో చురాచంద్పూర్లో సాధారణ జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, ఇతర వ్యాపారాలు మూతపడ్డాయి. 48 గంటల్లోగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఐటీఎల్ఎఫ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. లేకుంటే రాష్ట్రంలోని అన్ని పర్వత ప్రాంత జిల్లాల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. సోమవారం నుంచి మైతీలతో సరిహద్దు పంచుకొనే ఏరియాలను మూసివేస్తామని, బఫర్ జోన్ల నుంచి బయటకు వెళ్లేందుకు లేదా లోపలికి ప్రవేశించేందుకు ఎవరినీ అనుమతించమని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడుతాయని ఐటీఎల్ఎఫ్ పేర్కొన్నది.
రెండు రోజుల్లో ఐదు అరెస్టులు
మణిపూర్ హింసలో అంతర్జాతీయ కుట్ర ఆరోపణలపై ఎన్ఐఏ చురాచంద్పూర్కు చెందిన సెమిన్లున్ గాంగ్టేను శనివారం అరెస్టు చేసింది. మరోవైపు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇద్దరు మైతీ విద్యార్థుల హత్యకు సంబంధించి సీబీఐ ఇదే చురాచంద్పూర్లో నలుగురు కుకీ వ్యక్తులను అరెస్టు చేసింది. నిందితులతో సంబంధం ఉన్న మరో ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకొన్నది. కుకీ సంఘాల ఆరోపణల నేపథ్యంలో అరెస్టులపై సీబీఐ, ఎన్ఐఏ స్పందించాయి. సాక్ష్యాధారాల ఆధారంగానే అరెస్టు చేసినట్టు దర్యాప్తు సంస్థలు సోమవారం వెల్లడించాయి. ఏ వర్గం లేదా మతం పట్ల ఎటువంటి పక్షపాతం లేదని, కేవలం చట్టాలను మాత్రమే పాటిస్తామని అధికారులు పేర్కొన్నారు.