Manipur CM Biren Singh | ఇంఫాల్ : మణిపూర్ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బీరేన్ సింగ్.. ఆ రాష్ట్రంలోని కుకీ వర్గం ప్రజలను అవహేళన చేస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం బీరేన్ సింగ్ రాజీనామా చేస్తారంటూ రాజధాని ఇంఫాల్‌లో పెద్ద హైడ్రామా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయట్లేదని సీఎం ట్విట్టర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో పలువురు చేసిన కామెంట్లకు బీరేన్ సింగ్ స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ‘మీరు ఎప్పుడో చాలా రోజుల క్రితమే రాజీనామా చేయాల్సింది!’ అని థాంగ్ కుకీ అనే ఓ యూజర్ పేర్కొనగా.. అందుకు ‘నువ్వు భారతీయుడివా లేక మయన్మార్ దేశస్తుడివా?’ అని బీరేన్ ప్రశ్నించారు.
మణిపూర్‌లోని కుకీ ప్రజలకు, మయన్మార్ సరిహద్దుల వెంట నివసించే వారితో బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ పైవిధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. ‘మయన్మార్‌లో మైతీ వర్గం ప్రజలు కూడా భారీగా నివసిస్తున్నారు’ అని మరో యూజర్ పేర్కొనగా.. మయన్మార్‌లోని మైతీలు ప్రత్యేక ప్రాంతం అడగట్లేదు అంటూ బీరేన్ సమాధానం ఇచ్చారు. తాను కుకీలు కోరుకొంటున్న ప్రతిపాదిత ప్రత్యేక రాష్ట్రం ‘జలెంగమ్’ పౌరుడిని అని ఒక యూజర్ చెప్పుకొగా.. ‘అయితే మయన్మార్‌లో ఉండొచ్చు’ అని మణిపూర్ సీఎం సమాధానాలు ఇవ్వడం వివాదమైంది. ఈ రిైప్లె ట్వీట్లు అన్నింటినీ బీరేన్ సింగ్ తర్వాత తొలగించడం గమనార్హం.