పాతానమిట్టై: శబరిమల అయ్యప్పకు(Sabarimala Ayyappa Temple) చెందిన మండల పూజా సీజన్ ప్రారంభమైంది. ఇవాళ అయ్యప్ప ఆలయాన్ని తెరిచారు. వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు. తలుపులు తీయగానే.. శరణం అయ్యప్ప అంటూ శబరిమల ఊగిపోయింది. శుక్రవారం నుంచే సన్నిధానంకు భక్తుల రాక మొదలైంది. వర్చువల్ క్యూ విధానం ద్వారా శనివారం 70 వేల మంది భక్తులు బుకింగ్ చేసుకున్నారు. స్పాట్ బుకింగ్ల ద్వారా మరో 10 వేల మంది బుక్ చేసుకునే అవకాశం ఉన్నది.
అయ్యప్ప స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు మూసివేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. ప్రతి రోజు నెయ్యి అభిషేకం తెల్లవారుజామున 3.30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఉదయం 7.30 నిమిషాలకు ఉషా పూజ ఉంటుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఉచ్చ పూజ నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నిమిషాలకు దీపారాధాన ఉంటుంది. రాత్రి 9.30 నిమిషాలకు అతజాపూజ నిర్వహిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో దర్శన సమయాన్ని రోజుకు 18 గంటలకు పెంచారు.
మండల పూజ సీజన్ సందర్భంగా తొలి రెండు వారాల పాటు వర్చువల్ క్యూ బుకింగ్ ఫుల్ అయ్యింది. 14 రోజుల వరకు బుకింగ్ ఖాళీ లేదు. నవంబర్ 30వ తేదీ కోసం ఆరు వేల స్లాట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్రతి రోజు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70 వేల మంది దర్శనం చేసుకోనున్నారు. పంపా, ఎరుమేలి, సాత్రం వద్ద స్పాట్ బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పంపా స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద భారీగా జనం ఉన్నట్లు తెలుస్తోంది.