 
                                                            న్యూఢిల్లీ: ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. పుట్టిన రెండు రోజులకే కవల కూతుళ్లను చంపాడు. (Man Kills Twin Daughters) శిశువుల మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు కవల పిల్లల మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం వెతుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నీరజ్ సోలంకి, పూజకు 2022లో వివాహమైంది. ఈ ఏడాది మే 30న హర్యానాలోని రోహ్తక్ ఆసుపత్రిలో కవల పిల్లలకు పూజ జన్మనిచ్చింది. అయితే కవలలిద్దరూ ఆడ బిడ్డలు కావడం పట్ల నీరజ్, అతడి కుటుంబ సభ్యులు అంతృప్తి చెందారు. కట్నంతోపాటు మగ పిల్లాడ్ని కనాలంటూ అత్తింటి వారు పూజను తొలి నుంచి వేధించసాగారు.
కాగా, జూన్ 1న ఆసుపత్రి నుంచి పూజ, కవల పిల్లలు డిశ్చార్జ్ అయ్యారు. పూజ ఒక కారులో పుట్టింటికి బయలుదేరింది. భర్త నీరజ్ కవల కూతుళ్లతో కలిసి మరో కారులో ప్రయాణమయ్యాడు. తమ కారు వెనుకే నీరజ్ కారు వస్తున్నట్లు పూజ భావించింది. అయితే మార్గమధ్యలో కారు రూటు మార్చిన నీరజ్, కవల పిల్లలతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. పూజ, ఆమె సోదరుడు ఫోన్ చేసినప్పటికీ అతడు స్పందించలేదు.
మరోవైపు రెండు రోజులపాటు నీరజ్, కవల శిశివుల ఆచూకీ లేకపోవడంతో పూజ, ఆమె కుటుంబం ఆందోళన చెందింది. నీరజ్ తన కవల కూతుళ్లను హత్య చేసి ఢిల్లీ శివారులోని పూత్ కలాన్లో పాతిపెట్టినట్లు పూజ సోదరుడికి తెలిసింది. దీంతో పూజ, అతడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, జూన్ 5న కవల శిశువుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీరజ్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నీరజ్ కోసం వెతుకుతున్నారు.
 
                            