జైపూర్: ఒక వ్యక్తి వివాహిత మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె భర్త కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశాడు. (Man Stabbed To Death) అనంతరం భార్యాభర్తలు అక్కడి నుంచి పారిపోయారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారిద్దరి కోసం వెతుకుతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దుంగార్పూర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల జితేంద్ర మీనా, ఉదయపూర్ జిల్లాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న 25 ఏళ్ల డింపుల్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలోని అద్దె ఇంట్లో వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.
కాగా, ఆదివారం మధ్యాహ్నం డింపుల్ భర్త నర్సి ఆ ఇంటికి చేరుకున్నాడు. జితేంద్రను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత డింపుల్ తన భర్తతో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. జితేంద్ర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. జితేంద్ర హత్య తర్వాత డింపుల్, ఆమె భర్త నర్సి అక్కడి నుంచి పారిపోవడాన్ని గమనించారు. మృతుడి జిల్లాకు చెందిన వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. జితేంద్ర హత్యకు కారణం ఏమిటన్నది వారి అరెస్ట్ తర్వాత తెలుస్తుందని చెప్పారు.