లక్నో: బంధువు పెళ్లి ఊరేగింపులో ఒక వ్యక్తి పాల్గొన్నాడు. అయితే ఒక మహిళతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Man Shot Dead in Marriage Procession) ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అత్తమామల కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన 32 ఏళ్ల అమిత్ త్రివేది భార్య మూడేళ్ల కిందట మరణించింది. అయితే శుక్రవారం రాత్రి అత్తమామల గ్రామమైన జెబా ముకుంద్‌పూర్‌లో జరిగిన పెళ్లి ఊరేగింపులో అతడు పాల్గొన్నాడు.
కాగా, ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు అమిత్‌పై కాల్పులు జరిపారు. దీంతో కాల్పుల గాయాలతో రోడ్డు పక్కన మరణించిన అతడ్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అత్తమామల కుటుంబానికి చెందిన ఒక మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. అలాగే అమిత్‌పై కాల్పుల తర్వాత అత్తింటి కుటుంబానికి చెందిన అభిషేక్, అమన్ పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో అమిత్ బంధువు ఫిర్యాదుతో వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.