ముంబై: మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన ఊరికి వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసిన ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. (Man Sets On Fire Live-In Partner) కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. భర్త నుంచి విడిపోయిన 32 ఏళ్ల మహిళ కొన్నేళ్లుగా ఒక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నది. థానేలో వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోని ఒక ఇంట్లో వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు.
కాగా, ఆ వ్యక్తి తన సొంతూరుకు వెళ్లి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. జూలై 5న ఈ విషయం గురించి ఆ వ్యక్తి, సహజీవనం చేస్తున్న మహిళ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన అతడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 109(1) కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ కోలుకుంటున్నదని తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.