ఏ పని చేసినా.. ఆ పని మీద శ్రద్ధ, ఆసక్తి ఉంటే.. అందులోనే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. జీవనం కోసం.. బతుకుబండిని లాగడం కోసం ఏదో ఒక చేసుకొని బతకాల్సిందే. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా ఓ వ్యక్తి గత 27 ఏళ్ల నుంచి సైకిల్ మీద దోశలు వేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
ముంబైలోని మలాడ్‌కు చెందిన శ్రీనివాస్‌ను అందరూ దోశావాలా అని పిలుస్తుంటారు. రోజూ ఉదయాన్నే ఆయన సైకిల్ కోసం మలాడ్ వాసులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఆయన వేసే దోశకు అంత పాపులారిటీ ఉంది మరి. ఒక్కటి కాదు.. రెండు కాదు.. సుమారు 100 రకాల దోశలను సైకిల్ మీదే వేసి కస్టమర్‌కు ఇచ్చేంత నైపుణ్యం ఆయన సొంతం. ఏదోశ కావాలంటే అది.. ప్లేన్ దోశ దగ్గర్నుంచి.. మసాలా దోశ, ఆనియన్ దోశ, వెజిటబుల్ దోశ, పిజ్జా దోశ.. ఇలా 100 రకాల దోశలను సైకిల్ మీదే వేయగలడు. ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు మలాడ్ ప్రాంతం మొత్తం తిరుగుతూ దోశలు అమ్ముతాడు శ్రీనివాస్.
సైకిల్ మీదనే దోశ వేయడం కోసం స్టవ్, పేనం.. అన్నీ సెట్ చేసుకుంటాడు శ్రీనివాస్. కస్టమర్‌కు వెంటనే దోశ వేసి.. వేడి వేడిగా సర్వ్ చేస్తాడు. క్షణాల్లో దోశ ఇంటి దగ్గరే వేసి ఇవ్వడంతో పాటు.. శ్రీనివాస్ వేసే దోశ టేస్ట్ అదిరిపోతుందట. అందుకే అక్కడి స్థానికులు.. శ్రీనివాస్ దోశకు అడిక్ట్ అయిపోయారు. శ్రీనివాస్ దోశ ఎలా తయారు చేస్తాడో.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శ్రీనివాస్ దోశను చూసి వావ్.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. సైకిల్ మీద వీధులు తిరుగుతూ తక్కువ ధరకే వేడి వేడి దోశలు అందిస్తున్న శ్రీనివాస్‌ను చూసి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు.