ముంబై: ఒక వ్యక్తి తాగునీటి కోసం ఒక ఇంటి తలుపుతట్టాడు. ఇంట్లోకి ప్రవేశించిన అతడు మహిళ ఒంటరిగా ఉన్నట్లు గ్రహించాడు. టీవీ సౌండ్ పెంచి ఆమెను హత్య చేశాడు. (Man Kills Old Woman) ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేందుకు లక్ష విలువైన ఆమె చెవి రింగులను దొంగిలించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 20న కళ్యాణ్ ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల రంజనా పటేకర్ ఇంట్లో హత్యకు గురైంది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు. చివరకు నిందితుడైన 30 ఏళ్ల అక్బర్ ముహమ్మద్ షేక్ అలియాస్ చంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, రౌడీ షీటర్ అయిన అక్బర్ ముహమ్మద్ షేక్ గతంలో ఒక కేసులో అరెస్టయ్యాడని పోలీస్ అధికారి తెలిపారు. ఎనిమిది నెలల కిందట జైలు నుంచి అతడు విడుదలైనట్లు చెప్పారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న అతడు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేయాలని భావించాడని పోలీస్ అధికారి తెలిపారు. దీనికి డబ్బుల కోసం చోరీకి పాల్పడ్డాడని చెప్పారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రంజనా పటేకర్‌ను గొంతు నొక్కి హత్య చేసి ఆమె చెవి రింగులు అపహరించాడని వివరించారు. శుక్రవారం అతడ్ని అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.