బెంగళూరు: మొబైల్ ఫోన్‌కు వ్యసనమైన (Phone addiction) భార్యను భర్త హత్య చేశాడు. అయితే కుమార్తె మృతదేహాన్ని పడేసేందుకు అల్లుడికి మామ సహకరించాడు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొప్పలు గ్రామంలో నివసిస్తున్న భార్యాభర్తలైన శ్రీనాథ్, పూజకు తొమ్మిదేండ్ల కిందట పెళ్లి జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. కొన్నేండ్లుగా పూజ మొబైల్ ఫోన్‌కు బానిస అయ్యింది. రీల్స్, షార్ట్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, ఎప్పుడూ మొబైల్ ఫోన్‌తో గడుపుతూ, సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న భార్య పూజకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉందని భర్త శ్రీనాథ్ అనుమానించాడు. అలాగే మొబైల్ ఫోన్‌కు ఆమె వ్యసనం కావడంపై రెండు రోజుల కిందట వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన శ్రీనాథ్ చున్నీతో గొంతు నొక్కి భార్య పూజను చంపాడు. అనంతరం ఈ విషయాన్ని పూజ తండ్రికి చెప్పాడు. దీంతో కుమార్తె మృతదేహాన్ని పడేసేందుకు అల్లుడికి అతడు సహకరించాడు. వారిద్దరూ కలిసి బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతదేహానికి రాయి కట్టి సమీపంలోని నదిలో పడేశారు.
మరోవైపు భార్యను హత్య చేసిన తర్వాత శ్రీనాథ్ ఒక గుడికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతడు అనూహ్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను చంపానని, మృతదేహాన్ని పడేసేందుకు మామ సహకరించినట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.