అహ్మదాబాద్: ఉద్యోగం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటిలోని గదిలో విషవాయువు నింపుకుని చనిపోయాడు. ఇంటి లోపలకు రావద్దని, విష వాయువు ఉన్నదంటూ సూసైడ్ నోట్ ద్వారా కుమార్తెను హెచ్చరించాడు. (Man kills self in poison-filled room) గుజరాత్లోని గాంధీనగర్లో ఈ సంఘటన జరిగింది. ముంబైకు చెందిన 42 ఏళ్ల పంకజ్ భన్సాలీ తన కుటుంబంతో కలిసి గాంధీనగర్లోని ఉన్నత ప్రాంతంలో నివసిస్తున్నాడు.
కాగా, గాంధీనగర్ ఇన్ఫోసిటీలోని స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక సంస్థలో పంకజ్ పనిచేశాడు. అయితే ఐదు నెలల కిందట ఉద్యోగాన్ని కోల్పోయాడు. స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
మరోవైపు మే 22న పంకజ్ భార్య తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఆ మరునాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘సెల్ఫాస్’ అనే విష వాయువు వల్ల చనిపోయాడు. పంకజ్ ఫోన్ ఎత్తకపోవడంతో అతడి భార్య అనుమానించింది. కుమార్తె, సోదరుడితో కలిసి ఇంటికి చేరుకున్నది.
అయితే ఇంటి బయట ఒక హెచ్చరిక నోట్ వారికి కనిపించింది. ‘లోపల విష వాయువు ఉన్నది. లోనికి రావద్దు. మాస్క్ ధరించండి. ఇంట్లోని నీటిని తాగవద్దు. మాన్వీ బయటే ఉండు’ అని కుమార్తెను ఉద్దేశించి అందులో రాసి ఉన్నది. ఇంట్లోని గదిలో పంకజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గమనించారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. విషం వల్ల పంకజ్ మృతదేహం నల్లగా మారి ఉబ్బడాన్ని పరిశీలించారు. ఐదు రోజులుగా మృతదేహం ఆ ఇంట్లో ఉన్నట్లు గ్రహించారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంటి నుంచి ‘సెల్ఫాస్’ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.