రాయ్‌పూర్: ఒక వ్యక్తి త్రిశూలంతో తన బామ్మను చంపాడు. ఇంటి పక్కనే ఉన్న శివాలయంలోని శివలింగానికి ఆమె రక్తాన్ని అర్పించాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి అదే త్రిశూలంతో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూఢ నమ్మకాల వల్ల ఆ వ్యక్తి నానమ్మను నరబలి (Human Sacrifice) ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నన్‌కట్టి గ్రామానికి చెందిన 30 ఏళ్ల గుల్షన్ గోస్వామి తన నానమ్మ అయిన 70 ఏళ్ల రుక్మిణి గోస్వామితో కలిసి శివాలయానికి దగ్గరగా ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. అతడు ప్రతిరోజూ ఆ శివాలయంలో పూజలు చేసేవాడు.
కాగా, అక్టోబర్ 19న శనివారం సాయంత్రం గుల్షన్ తన నానమ్మ రుక్మిణిని త్రిశూలంతో పొడిచి చంపాడు. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి శివలింగానికి ఆమె రక్తాన్ని అర్పించాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతడు అదే త్రిశూలంతో తన మెడపై పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న గుల్షన్‌ను రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో చేర్చారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మూఢ నమ్మకాల వల్ల గుల్షన్ తన నానమ్మను నరబలి ఇచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.