Bihar | బిహార్‌లోని ఆరా రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. 16 ఏండ్ల బాలికను, ఆమె తండ్రిని ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. జియా కుమారి (16), ఆమె తండ్రి అనిల్ సిన్హా మంగళవారం రాత్రి ఆరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఢిల్లీకి వెళ్లేందుకు 3,4వ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో వారి దగ్గరకు వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మొదట బాలికను, ఆ తర్వాత ఆమె తండ్రిని కాల్చి చంపాడు. అనంతరం అతనూ కాల్చుకున్నాడు. కాగా, దాడి చేసిన వ్యక్తిని భోజ్పుర్కు చెందిన అమన్‌కుమార్(24)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. ఫొరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించారని పేర్కొన్నారు. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదని వెల్లడించారు. అయితే ప్రేమ వ్యవహరమే హత్యకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.