జైపూర్: సమోసాలో బ్లేడ్ ముక్క కనిపించింది. (blade in samosa) ఇది చూసి కొనుగోలు చేసిన వ్యక్తి షాక్ అయ్యాడు. దీంతో ఈటరీలోని వ్యక్తిని అతడు నిలదీశాడు. సరైన సమాధానం ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి దీని గురించి పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నివాయ్ టౌన్‌కు చెందిన రమేష్ వర్మ హోంగార్డుగా పని చేస్తున్నాడు. జైన్ నామ్కీన్ భండార్ నుంచి కచోరీ, మిర్చీ బజ్జీలు, సమోసాలు కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లిన తర్వాత ఒక సమోసాను విరిచాడు. షేవింగ్ బ్లేడ్ ముక్క అందులో ఉండటం చూసి షాక్ అయ్యాడు.
కాగా, రమేష్ వర్మ వెంటనే ఆ ఈటరీ వద్దకు వెళ్లాడు. సమోసాలో బ్లేడ్ ముక్క ఉండటాన్ని చూపించాడు. అయితే షాపులోని వ్యక్తి అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అక్కడి నుంచి బలవంతంగా పంపించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు రమేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ షాపు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. మరోవైపు పోలీసులు కూడా ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.