లక్నో: ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. (Man Chops Wife Into Pieces) పది కిలోమీటర్ల మేర వాటిని పడేశాడు. ఒకచోట చేతిని కాల్చి పాతిపెట్టాడు. మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు మహిళ భర్తను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 31 ఏళ్ల సైఫుద్దీన్, 25 ఏళ్ల భార్య సబీనాతో కలిసి లక్నోకు బయలుదేరాడు. మార్గమధ్యలో భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికాడు. కొన్ని భాగాలను కాలువలోకి విసిరాడు. శ్రావస్తి ప్రాంతంలోని పది కిలోమీటర్ల మేర మరికొన్ని భాగాలను చెల్లాచెదురుగా పడేశాడు.
కాగా, మే14న సబీనా సోదరుడు సలాహుద్దీన్ ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అదే రోజున సోదరి ఇంటికి వెళ్లాడు. భార్యాభర్తలు లక్నో వెళ్లినట్లు తెలుసుకున్నాడు. అయితే సోదరి భర్త సైఫుద్దీన్ నగరంలో తిరగడం చూసి షాక్ అయ్యాడు. సోదరి సబీనా జాడ లేకపోవడంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తన సోదరిని వేధిస్తున్నారని ఆరోపించాడు.
మరోవైపు సైఫుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే సబీనా మిస్సింగ్ గురించి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. రెండు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించిన తర్వాత చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు. భార్య సబీనాను చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పడేసినట్లు తెలిపాడు. నరికిన చేతిని తగులబెట్టి సమీపంలోని గార్డెన్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీంతో దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు సైఫుద్దీన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు.