న్యూఢిల్లీ: ఒక వ్యక్తి, అతడి నలుగురు కుమార్తెలు ఇంట్లో శవమై కనిపించారు. (Man, 4 Daughters Found Dead) ఆ వ్యక్తి తన కుమార్తెలను హత్య చేసిన తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురి మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రంగ్‌పురి ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతడి నలుగురు కుమార్తెలు సెప్టెంబర్ 24 నుంచి బయటకు రాలేదు. తలుపులు మూసి ఉన్న ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని బిల్డింగ్ యజమాని శుక్రవారం గుర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, ఆ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో తలుపులు తెరిచి లోనికి వెళ్లారు. కార్పెంటర్‌గా పనిచేసే 46 ఏళ్ల హీరాలాల్ శర్మ ఒక గదిలో, అతడి కుమార్తెలైన 26 ఏళ్ల నీతు, 24 ఏళ్ల నిక్కి, 23 ఏళ్ల నీరూ, 20 ఏళ్ల నిధి మరో గదిలో మరణించి ఉండటాన్ని చూశారు. కుమార్తెల నడుము, మెడకు ఎర్రటి దారం కట్టి ఉన్నట్లు గమనించారు.
మరోవైపు మూడు ప్యాకెట్ల విషం, ఐదు గ్లాసులు, అనుమానాస్పద ద్రవంతో కూడిన చెంచా ఆ ఇంట్లో కపిపించాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తండ్రి మొదట ఆడ పిల్లలకు విషం ఇచ్చి చంపి, ఆ తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఏడాది కిందట క్యాన్సర్‌తో భార్య చనిపోవడంతో హీరాలాల్ అప్పటి నుంచి కుటుంబాన్ని సరిగా పట్టించుకోవడం లేదని పొరుగువారు పోలీసులకు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెలకు చికిత్స కోసం హాస్పిటల్స్ చుట్టూ అతడు తిరిగినట్లు బంధువులు చెప్పారు. ఈ నేపథ్యంలో నలుగురి మరణానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.