ప్రస్తుతానికి తాను కేంద్రంపై ఎలాంటి విమర్శలూ చేయాలని అనుకోవడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధాన విషయంలో మాత్రం విమర్శలు చేయాలని అనుకోవడం లేదన్నారు. ఎందుకంటే.. మనమందరమూ ఒక్కటేనని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లోని ఇరుక్కుపోయారని, ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తిరుగుతున్నారని, కొందరు బంకర్లలో తలదాచుకున్నారని మమత వాపోయారు. మరి కొందరు రొమానియాలో వేచి చూస్తున్నారని, ఆహారం కూడా అందడం లేదని, ఆహారం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఉక్రెయిన్లో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం అలర్ట్ గానే వుందని, మరి విద్యార్థులను ఎందుకు తీసుకురాలేకపోయిందని సూటిగా ప్రశ్నించారు.
యూపీ ప్రచారానికి వెళ్తున్నా : మమత
యూపీ ప్రచారానికి తాను వెళ్తున్నట్లు సీఎం మమత ప్రకటించారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ తరపున వారణాసిలో ప్రచారం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వారణాసి దేవాలయానికి కూడా వెళ్తానని పేర్కొన్నారు. ఇక.. మోదీని కలిసే విషయంపై విలేకరులు అడగ్గా… ప్రస్తుతం మోదీ యూపీ ఎన్నికల హాడావుడిలో ఉన్నారు. నేనూ యూపీ ప్రచారానికి వెళ్తున్నా. ముగిసిన తర్వాతే మాట్లాడతా అంటూ మమత తెలిపారు.