కోల్‌కతా: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ఈ నిరసనలో తాను పాల్గొనవచ్చని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు. (Mamata Banerjee) ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నిరసనల్లో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మమతా బెనర్జీ ఢిల్లీకి బయలుదేరారు. దీనికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. పండుగ సీజన్ వచ్చి ప్రజలు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, నిరసనల్లో పాల్గొనడం అవసరమని తనకు అనిపించిందని మమతా బెనర్జీ తెలిపారు. ‘ప్రజలు ఒక ముఖ్యమైన కారణం కోసం గళం విప్పుతున్నప్పుడు, మనం వారికి అండగా నిలబడాలి’ అని అన్నారు.
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద జరగనున్న నిరసనలో తాను పాల్గొనవచ్చని మమతా బెనర్జీ తెలిపారు. అయితే ఇప్పుడే ఏదీ ధృవీకరించలేమని చెప్పారు. ‘మేము వారి (సీజేపీ)తో సంబంధాలు కొనసాగిస్తున్నాం, మా మద్దతును తెలియజేశాం. మా భాగస్వామ్యానికి సంబంధించిన తదుపరి నిర్ణయం తర్వాత తీసుకుంటాం’ అని అన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్)లో జరిగిన అవకతవకలు, ఎన్నికల అక్రమాలపై బీజేపీ, ఎన్నికల కమిషన్‌పై మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల నుంచి లక్షలాది మంది పేర్లను అన్యాయంగా తొలగించారని విమర్శించారు. అలాగే ఎన్నికల ప్రక్రియను బలహీనపరిచేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి పద్ధతులు ఎక్కువ కాలం కొనసాగవని, ఓట్లను అక్రమంగా దక్కించుకోవడం ద్వారా ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండలేదని అన్నారు.
మరోవైపు అక్టోబర్ 6 నాటి నిరసనలలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును మమతా బెనర్జీ తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ‘రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఉద్యమంలో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది, కానీ ప్రియాంక పట్ల వ్యవహరించిన తీరు కూడా చాలా తప్పు’ అని ఆమె అన్నారు.
అయితే సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనలు కేవలం వ్యక్తిగత పార్టీలకు సంబంధించినవి కావని మమతా బెనర్జీ తెలిపారు. వీటికి జాతీయ స్థాయిలో రాజకీయ నాయకుల దృష్టి అవసరమని చెప్పారు. ప్రతిపక్ష నాయకులపై పోలీసుల చర్యకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను సంప్రదిస్తానని ఆమె అన్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల నాయకుల సంతకాలు, మద్దతు కోరనున్నట్లు తృణమూల్ అధినేత్రి వెల్లడించారు.