పాట్నా, డిసెంబర్ 24: బీహార్‌లోని ఒక ప్రభుత్వ టీచర్ మెటర్నిటీ లీవ్‌కు దరఖాస్తు చేయగా, దానిని అధికారులు మంజూరు చేశారు. అయితే ఇందులో విచిత్రమేమిటంటే అలా ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసింది పురుష ఉపాధ్యాయుడు కాగా, దానిని చూడకుండా అధికారులు కళ్లుమూసుకుని ఓకే చేసేశారు. ఆ ఉపాధ్యాయుడు కూడా వారం రోజుల మెటర్నిటీ లీవ్‌ను ఎంజాయ్ చేశాడు.
టీచర్ల ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ విషయం బయటపడటంతో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే అది ‘టెక్నికల్ ఎర్రర్’ అని దానిని తర్వాత సవరించినట్టు వైశాలి జిల్లా మహువా బ్లాక్ ఇన్చార్జి విద్యాధికారి అర్చనా కుమారి తెలిపారు. మెటర్నిటీ లీవ్ కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారని, అలాగే పిల్లలను చూసుకునేందుకు మగవారికి పెటర్నిటీ లీవ్ (పితృత్వ సెలవు)ను మంజూరు చేస్తామని ఆమె వివరణ ఇచ్చారు.