న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత ఆ పార్టీని వీడారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. (Delhi Congress leader joins AAP) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అయితే దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మతీన్ అహ్మద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. 1993 నుంచి 2013 వరకు ఢిల్లీలోని సీలంపూర్ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ స్థానం నుంచి ఆప్ తరుఫున ఆయన పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, మతీన్ అహ్మద్ ఆప్‌లో చేరడాన్ని అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఆలస్యమైనప్పటికీ ఆయన సరైన పార్టీలో చేరారని అన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆయన ప్రముఖమైన వ్యక్తి అని కొనియాడారు.
మరోవైపు మతీన్ అహ్మద్ కుమారుడు చౌదరి జుబేర్ అహ్మద్, ఆయన భార్య, కాంగ్రెస్ కౌన్సిలర్ అయిన షగుఫ్తా చౌదరి అక్టోబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.