న్యూఢిల్లీ, నవంబర్ 10: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో ప్రధాన షూటర్ శివకుమార్‌ను ఆదివారం ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్‌లో పోలీసులు పట్టుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాలతో తాను ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో శివకుమార్ వెల్లడించాడని తెలిసింది. నిందితుడు శివకుమార్ నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై క్రైమ్ బ్రాంచ్, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఆశ్రయమిచ్చిన మరో నలుగుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశారు. ముంబైలోని బాంద్రాలో అక్టోబర్ 12న ముగ్గురు దుండగులు బాబా సిద్దిఖీపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.