జబల్పుర్: మహారాష్ట్రకు చెందిన బీజేపీ మైనార్టీ వింగ్ చీఫ్(BJP Leader) సనా ఖాన్ హత్యకు గురైంది. భర్తే ఆమెను చంపినట్లు తేలింది. గత వారం రోజుల నుంచి ఆమె ఆచూకీ లేదు. జబల్పుర్, నాగపూర్ పోలీసులు తమ సంయుక్త విచారణలో ఆ మర్డర్ మిస్టరీని చేధించారు. భార్యను చంపిన కేసులో అమిత్ అలియాస్ పప్పూ సాహును అరెస్టు చేశారు.
నాగపూర్‌లో ఉంటున్న సనా ఖాన్.. తన భర్తను కలిసేందుకు జబల్పుర్ వెళ్లింది. అమిత్‌ను కలిసి రెండు రోజుల్లో మళ్లీ వెనక్కి రావాలనుకున్నది. అయితే అక్కడకి వెళ్లిన తర్వాత ఆమె అదృశ్యమైంది. ఆమె మళ్లీ స్వంత ఇంటికి వెళ్లలేకపోయింది. లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో ఉన్న అమిత్‌తో సనా ఖాన్ గొడవకు దిగినట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య చాన్నాళ్ల నుంచి వివాదం నడుస్తోంది.
అయితే పోలీసుల విచారణలో సనా ఖాన్‌ను మర్డర్ చేసినట్లు అమిత్ అంగీకరించాడు. ఇంట్లోనే సనాను కొట్టినట్లు చెప్పాడు. తలపై బలమైన దెబ్బ తగలడంతో ఆమె మరణించింది. ఆ తర్వాత ఆమె శరీరాన్ని జబల్పుర్ సమీపంలోని హిరాన్ నదిలో పడేశాడు. ఈ కేసుతో లింకు ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఆగస్టు 2వ తేదీన నాగపూర్ నుంచి సనా ఖాన్ జబల్పుర్ వెళ్లింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. ఫ్యామిలీ సభ్యులు ఎంత సెర్చ్ చేసినా ఆమె ఆచూకీ చిక్కలేదు. అయితే నాగపూర్, జబల్పుర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు.