Accident | మహారాష్ట్ర నందూర్బార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాంద్సైలి ఘాట్ వద్ద భక్తులతో వెళ్తున్న పికప్ ట్రక్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ధడ్గావ్ తాలూకలోని అస్లి వద్ద అష్టంబ (అశ్వత్థామ) రుషి తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ తీర్థయాత్ర ఏటా దీపావళి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
పికప్ వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో పికప్ ట్రక్ లోయలోకి పడిపోయినట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఐదుగురు నందూర్బార్ తాలూకాలోని ఘోటానే నివాసితులుగా సమాచారు. ప్రమాదం జరిగిన సమయంలో పికప్ ట్రక్‌లో దాదాపుగా 25 మంది భక్తులు ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డ వారిని నందూర్బార్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలకు గురైన వారిని చికిత్స కోసం తలోడా ఉప జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న తలోడా పోలీసులు గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.