ముంబై : ఓ ఎలక్ట్రానిక్స్ షాపు కీపర్‌ను ఇద్దరు దుండగులు కత్తితో పొడిచి చంపి, నగదును చోరీ చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలోని చిఖ్లి సిటీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
కమలేశ్ పొపట్ అనే వ్యక్తి ఆనంద్ ఎలక్ట్రానిక్స్ పేరిట ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి షాపు మూసేముందు.. ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ముఖాలకు మాస్కులు ధరించిన వారు.. ఓనర్‌ను గన్‌తో బెదిరించారు. అక్కడే ఉన్న షాపు కీపర్ ఆ దుండగులను నిలువరించేందుకు యత్నించాడు. దుండగుల్లో ఒకరు తన వద్ద పదునైన కత్తితో షాపు కీపర్‌ను పొడిచి చంపాడు.
అనంతరం షాపులో ఉన్న నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న షాపు కీపర్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.