ముంబై: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని ముస్లింలు (Muslim) ఎవరూ ఔరంగజేబు (Aurangzeb)వారసులు కాదని, దేశంలోని జాతీయవాద ముస్లింలెవరూ (Nationalist Muslims) మొఘల్ చక్రవర్తిని (Mughal Emeror) తమ నాయకుడిగా గుర్తించరని చెప్పారు. ఔరంగజేబు మన నాయకుడు ఎలా అవుతాడని, మన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) మాత్రమేనని చెప్పారు. జాతీయవాద ముస్లింలు ఎవరూ ఆయనను తమ నాయకుడిగా అంగీకరించని, అతని వారసులు దేశం బయట ఉన్నారని చెప్పారు.
ఔరంగాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన వంచిత్ బహుజన్ అఘాడీ (VBA) చీఫ్ ప్రకాశ్ అంబేద్కర్‌ను (Prakash Ambedkar) ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చర్యను శివసేన (ఉద్ధవ్) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. ఉద్ధవ్ వర్గంతో ప్రకాశ్ అంబేద్కర్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.
జౌరంగజేబును పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో మహారాష్ట్రలో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్ అంబేద్కర్.. ఔరంగాజేబు సమాధిని ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఔరంగజేబు మన దేశాన్ని చాలాకాలం పాలించారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హిట్లర్ కూడా జర్మనీని చాలాకాలం పాలించాడని, ఆయన కూడా మన దేవుడవుతాడా అని ప్రశ్నించారు. ప్రకాశ్ అంబేద్కర్‌తో ఉద్ధవ్ పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు ఆయన చర్యలను ఠాక్రే అంగీకరిస్తున్నారా అని నిలదీశారు.