Maharashtra : మహారాష్ట్రలోని ముంబై సహా అనేక ప్రధాన పట్టణాల్లో బార్లలో డ్యాన్సులు చేయడం మామూలే. అయితే, ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు నిర్వాహకులు. ఈ తరహా చట్టవ్యతిరేక కార్యకలాపాల్ని అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాన్స్ బార్ల నిర్వహణపై కొత్త చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ‘మహారాష్ట్ర ప్రొహిబిషన్ ఆఫ్ ఆబ్సెన్స్ డాన్స్ ఇన్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ బార్ రూమ్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఉమన్ (వర్కింగ్ దేర్ ఇన్) యాక్ట్, 2016 పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది.
బార్లకు అనుమతించే విషయంలో ఇప్పటివరకు ఉన్న మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ స్థానంలో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రాష్ట్ర హోం శాఖ (రూరల్) మంత్రి పంకజ్ భోయర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో మహిళల డాన్స్‌పై కఠినమైన నిబంధనలు అమలవుతాయి. ఇప్పటికే డ్యాన్స్ బార్ల నిర్వహణపై మహారాష్ట్రలో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే, వాటిలోని లోపాలను అడ్డం పెట్టుకుని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో మహిళలతో డాన్స్ చేయిస్తున్నారు. నిజానికి ఈ తరహా డాన్సులపై, ఆర్కెస్ట్రా, మ్యూజిక్ ప్రోగ్రాంలపై మహారాష్ట్రలో నిషేధం ఉంది. కానీ, చట్టంలోని ఒక లోపాన్ని అడ్డుపెట్టుకుని పర్మిషన్ తీసుకుని బార్లు నడిపిస్తున్నారు. మహారాష్ట్ర సెక్షన్ 33 ప్రకారం.. పబ్లిక్‌లో డాన్సులు చేసేందుకు, ఆర్కెస్ట్రా, మ్యూజిక్ వినియోగించేందుకు స్థానిక పోలీస్ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్లు లైసెన్సులు జారీ చేయవచ్చు. దీంతో స్థానికంగా పబ్లిక్‌లో ఇలా డాన్స్‌కు అనుమతి పొంది బార్లు, హోటళ్లలో మహిళలతో డాన్స్ చేయిస్తున్నారు.
సాధారణ డాన్స్ ప్రదర్శనలకు అనుమతిపొంది, వీటిని బార్లలో అసభ్యకర డాన్సులుగా మారుస్తున్నారు. అందుకే, ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తచట్టం తీసుకొస్తోంది. దీని ప్రకారం.. ఆర్కెస్ట్రా, లైవ్ మ్యూజిక్ పేరుతో అనుమతి పొంది డాన్స్ బార్లు నిర్వహించడం కుదరదు. కొత్త చట్టాలకు అనుగుణంగా ఉంటేనే అనుమతిస్తారు. లైసెన్సులు, నిర్వహణ, భద్రత, మహిళల రక్షణకు ఈ కొత్త చట్టం మరింతగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంది.