ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం అనలాగ్ పనీర్‌ను నిషేధించింది. ఆ రాష్ట్రంలో ఇక నుంచి ఎవరైనా అనలాగ్ పనీర్‌ను తయారు చేసినా, అమ్మినా ఆరు నెలల జైలుశిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించనున్నట్టు సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఆ పనీర్ తిని ఎవరైనా చనిపోతే రూ.10 లక్షల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించనుంది. ఒక్క చుక్క పాలు లేకుండానే వెజిటెబుల్ ఆయిల్, పామాయిల్‌తో పాటు స్టార్చ్, పాలపొడితో అనలాగ్ పనీర్ మిశ్రమాన్ని తయారు చేస్తారు. అది గడ్డకట్టేందుకు కొన్ని సింథటిక్ రసాయనాలు కలుపుతారు. చూడటానికి అచ్చం నిజమైన పనీర్లాగా ఉంటుంది. సాధారణ పనీర్ కంటే సగం ధరకే దొరుకుతుంది.
ఇలా గుర్తించండి..
నిజమైన పనీర్‌కు, అనలాగ్ పనీర్‌కు కొన్ని తేడాలుంటాయి. వేడి చేసినప్పుడు లేదా నీటిలో వేస్తే నిజమైన పనీర్ అలాగే ఉంటుంది. అనలాగ్ పనీర్ కరిగిపోతుంది. అసలు పనీర్ కొంచెం మిఠాయి సువాసన వస్తే.. అనలాగ్ పనీర్ పుల్లటి వాసన వస్తుంది. అసలు పనీర్‌ను నలిపినప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది. రబ్బర్లాగా సాగితే అది అనలాగ్ అని గుర్తించాలి. పాలు లేకుండా కేవలం పామాయిల్, రసాయనాలతోతయారు చేసే ఈ అనలాగ్ పనీర్ వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని ఆహార భద్రతా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ఇప్పటికే బ్యాన్ చేయగా.. ఈ లిస్టులోకి మహారాష్ట్ర కూడా చేరింది.