Maharashtra | మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలు కొనసాగుతున్నాయి. నాందేడ్‌లోని శంకర్రావు చవాన్ ప్రభుత్వ వైద్యకళాశాల, ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. తాజాగా ఛత్రపతి శంభాజీనగర్ జీఎంసీహెచ్‌లో మంగళవారం వరకు గడిచిన 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయని ఓ అధికారి తెలిపారు. గత 48గంటల్లో ఆసుపత్రుల్లో వివిధ కారణాలతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ నెల 2న ఉదయం 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 18 మంది మరణాలు నమోదయ్యాయని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. 18 మందిలో ఇద్దరు రోగులు గుండెపోటుకు గురయ్యారు. మరో ఇద్దరు న్యుమోనియాతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. మరో ముగ్గురు రోగులు కిడ్నీల వైఫల్యం, మరొకరు కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదం, విషయ ప్రయోగం, అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్తో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు పేర్కొన్నారు. మరో ఇద్దరు ప్రీ టెర్మ్ బేబీలు సైతం మరణించినట్లు పేర్కొన్నారు.
నవజాత శిశువులు కేవలం 1300 గ్రాముల బరువు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేదని సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రిలో 1177 పడకలకు అనుమతి ఉందని.. ఎప్పుడైనా 1600 మంది కంటే ఎక్కువ రోగులు అడ్మిట్ ఉంటారన్నారు. గత నెలలో దాదాపు 28వేల అడ్మిట్లు నమోదయ్యాయని.. ఇందులో419 మరణాలు నమోదయ్యాయన్నారు. మరాఠ్వాడా ప్రాంతంలోని వివిధ జిల్లాలు, ఉత్తర మహారాష్ట్రకు చెందిన రోగులు జీహెసీహెచ్ను సందర్శిస్తారని వైద్యులు పేర్కొన్నారు.