Chai Wale Baba : చాయ్ వాలీ బాబా..! ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన దినేశ్ స్వరూప్ బహ్మచారి (Dinesh Swaroop Brahmachari) చాయ్ అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఆ తర్వాత ఆయన సాధువుగా మారడంతో ‘చాయ్ వాలీ బాబా (Chai Wale Baba)’ అనే పేరు వచ్చింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13 నుంచి మహాకుంభ మేళా ప్రారంభ కానుండటంతో అందరు సాధువుల మాదిరిగానే ఆయన కూడా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నాడు.
అయితే ఆయన ప్రత్యేకతలు తెలుసుకుని జనం నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఆయన 40 ఏళ్లుగా ఎలాంటి ఆహారం ముట్టడం లేదు. కేవలం రోజుకు 10 కప్పుల చాయ్ మాత్రమే తాగుతాడు. అంతేకాదు ఆయన నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడు. కేవలం సైగలతోనే సంభాషణలు కొనసాగిస్తాడు. ఇంతేనా..! ఇందులో నోరెళ్లబెట్టడానికి ఏముంది అనుకుంటున్నారా..? ఆగండాగండి.. 40 ఏళ్లుగా తిండి తినకుండా, నోరు విప్పి మాట కూడా మాట్లాడకుండా ఆయన చేస్తున్న మరో ఆశ్యర్యకరమైన పని ఏమిటంటే.. సివిల్స్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం.
‘కేవలం టీ అమ్ముకునే వ్యక్తి సాధువుగా మారడం ఒకే.. సాధువుగా మారి ఏండ్లుగా మౌనం పాటించడం ఒకే.. 40 ఏండ్లుగా తిండి లేకుండా కేవలం చాయ్‌లతో గడపడం చాలా కష్టమే.. అయినా అదీ ఒకే.. జ్ఞానం సముపార్జించి సివిల్స్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడం ఒకే.. కానీ నోరు విప్పకుండా విద్యార్థులకు బోధన ఎలా చేస్తున్నాడు..?’ అని మీరు కూడా నోరెళ్ల బెట్టారు కదా..! అయితే అక్కడికే వెళ్దాం..
చాయ్ వాలీ బాబా విద్యార్థులకు బోధించడం కోసం వాట్సాప్‌నే కీలక వనరుగా మార్చుకున్నారు. సివిల్స్ అభ్యర్థులు వాట్సాప్ ద్వారా తమ సందేహాలను పంపితే.. బాబా వాటిని నివృత్తి చేస్తుంటాడు. ఆయన దగ్గర శిక్షణ పొంది ఎంతో మంది అభ్యర్థులు ఉద్యోగాలు సంపాదించారట. బాబాను ఆయన శిష్యులు గౌరవంగా మహారాజ్జీ అని పిలుచుకుంటారట. మహారాజ్ జీ గురించి ఆయన శిష్యుడు రాజేష్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేను నాలుగైదేళ్లుగా మహారాజ్ జీతో ప్రయాణం సాగిస్తున్నాను. సివిల్స్‌కు సంబంధించి మాకు అవసరమైనప్పుడల్లా ఆయన మార్గదర్శనం చేస్తుంటారు’ అని చెప్పాడు.
అయితే, 40 ఏళ్ల నుంచి తిండి లేకుండా ఎలా ఉండగలుగుతున్నారన్న ప్రశ్నకు చాయ్ వాలీ బాబా స్పందిస్తూ.. కఠినమైన నియమాలు పాటించడంతో అది సాధ్యమేనని చెప్పారు. మౌనంగా ఉండటానికి కారణమేమిటని అడగ్గా.. మౌనం మనిషిలో శక్తిని పోగు చేస్తుందని అన్నారు. కాగా ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాకు ప్రపంచ దేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.