చెన్నై: సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ వైపు తన కుమార్తెకు పెండ్లి చేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోవైపు ఇతర యువతులను సన్యాసినులుగా బతికేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తన ఇద్దరు కుమార్తెలు బాగా చదువుకున్నారని, వారు పెండ్లి చేసుకోకుండా ఈషా యోగా సెంటర్ బ్రెయిన్ వాష్ చేస్తున్నదని రిటైర్డ్ ప్రోఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్నది.
అయితే, 42, 39 సంవత్సరాల వయసుగల ఈ ఇద్దరు మహిళలు సోమవారం హైకోర్టుకు హాజరై, తాము తమ ఇష్ట ప్రకారమే, స్వీయ నిర్ణయంతోనే ఈషా యోగా సెంటర్లో ఉంటున్నామని చెప్పారు. ఈషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను తయారు చేసి, నివేదికను సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు 150 మంది పోలీసులు మంగళవారం ఈషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేశారు. కాగా పెండ్లి చేసుకోవాలని కానీ, బ్రహ్మచర్యం చేపట్టాలని కానీ తాము చెప్పబోమని ఈషా ఫౌండేషన్ వివరణ ఇచ్చింది.