Nikita Porwal | ముంబై: ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ 2024 పోటీల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నిఖితా పోర్వాల్ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. దాద్రా అండ్ నాగర్ హవేలికి చెందిన రేఖా పాండే, గుజరాత్‌కు చెందిన ఆయుషి ధోలకియా వరసగా ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. ఈ పోటీలో నిఖిత ఫ్యాషన్, టాలెంట్, వ్యక్తిత్వ ఆధారిత రౌండ్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచి మొత్తం 30 మందిని వెనక్కి నెట్టి కిరీటాన్ని దక్కించుకుంది.
ఫెమీనా మిస్ ఇండియాగా నిలవడంపై నిఖిత మాట్లాడుతూ.. ఆ అనుభూతిని వర్ణించలేనని పేర్కొంది. విజేతగా నిలవడానికి ముందు తాను అనుభవించిన టెన్షన్ ఇప్పటికీ అలాగే ఉందని తెలిపింది. తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని చెప్పింది. మిస్ ఇండియాగా ఎంపికైన నిఖిత మిస్ వరల్డ్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.