భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ప్రతి ఏడాది పాము కాటుకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాము కాటు వల్ల మృతిచెందిన వారికి నష్టపరిహారం ఇవ్వడం కూడా ప్రభుత్వానికి భారంగానే మారింది. దీంట్లో స్కాములు కూడా జరుగుతున్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో అక్కడ మరణాలు అధిక సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. అయితే పాము కాటు మృతుల సంఖ్యను తగ్గించేందుకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓ ప్లాన్ వేశారు. కింగ్ కోబ్రాలను మధ్యప్రదేశ్‌లో పెంచాలని ఆయన భావించారు. ఆ కోబ్రాలు ఉంటే.. చిన్న విషనాగులు పారిపోతాయని ఆయన ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా కర్నాటకలోని మంగళూరు జూ నుంచి కొన్ని రోజుల క్రితం ఓ కింగ్ కోబ్రాను పట్టుకువచ్చారు. దాన్ని భోపాల్ జూలో ఉంచారు. కానీ జూన్ 18వ తేదీన అది ఎన్‌క్లోజర్‌లోనే చనిపోయింది. కర్నాటక జూకు టైగర్‌ను ఇచ్చి.. అక్కడ నుంచి తెచ్చిన కింగ్ కోబ్రా చావడంతో మధ్యప్రదేశ్ ప్లాన్ కాస్త వికటించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎన్ని విష సర్పాలు ఉన్నాయో లెక్కించాలని కూడా మధ్యప్రదేశ్ సీఎం ఆదేశించారు. కానీ వాస్తవానికి ఇది కుదిరే విషయం కాదు. పాముల్ని లెక్కించే విధానం ఇప్పటి వరకు లేదు. గతంలో ఎవరూ చేయలేదు కూడా. ఒకవేళ కింగ్ కోబ్రాలు మధ్యప్రదేశ్‌లో బ్రతకగలిగితే, వాటి వల్ల చిన్న విషసర్పాలు దూరం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ప్లాన్ వేసింది. చిన్న పాములను కింగ్ కోబ్రా తీనేస్తే కొంత వరకైనా పాము కాటు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచించింది. కింగ్ కోబ్రా జాతికి చెందిన ఓ సర్పం కొన్నేళ్ల క్రితం చత్తీస్‌ఘడ్‌లోని కోర్బాలో కనిపించింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని సత్పురా, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ ఫారెస్టులోనూ ఆ సర్పాలు జీవించే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఆ ఉద్దేశంతోనే కర్నాటక నుంచి కింగ్ కోబ్రాను తెచ్చి.. మధ్యప్రదేశ్‌లో పెంచి పోషించాలనుకున్నారు. భోపాల్‌లోని వేడి వాతావరణాన్ని తట్టుకోలేక కింగ్ కోబ్రా ఎన్‌క్లోజర్‌లోనే ప్రాణాలు వదిలింది.
పశ్చిమ కనుమల్లో జీవించే కింగ్ కోబ్రా సర్పాలు.. సెంట్రల్ ఇండియా వాతావరణాన్ని తట్టుకోవడం కష్టమే అని వైల్డ్ లైఫ్ నిపుణలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్వంత జిల్లా దిండోరిలో ప్రతి ఏడాది 200 మంది పాము కాటుతో మృతిచెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆయన కింగ్ కోబ్రాలను వదలాలని భావిస్తున్నారు. కింగ్ కోబ్రాలు రంగంలోకి దిగితే, అది పాముల్ని తరిమేస్తుంది. రంధ్రాల్లోకి వెళ్లి మరీ వెంటాడుతుంది. కానీ మధ్యప్రదేశ్ వాతావరణం కోబ్రాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ బ్రీడింగ్ చేసి వాటిని పెంచినా.. అవి బ్రతకడం కష్టమే అని నిపుణులు చెబుతున్నారు.