ముంబై: కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన సీఎం షిండే వర్గం శివసేన నేత కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్‌ను (Look Out Circular) పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. అయితే చట్టం ముందు అంతా సమానమేనని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. శివసేన డిప్యూటీ లీడర్ రాజేష్ షా కుమారుడైన 24 ఏళ్ల మిహిర్ షా మద్యం మత్తులో బీఎమ్డబ్యూని డ్రైవ్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున వర్లీ ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న చేపలు అమ్ముకునే భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో మహిళ మరణించగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత మిహిర్ షా అక్కడి నుంచి పారిపోయాడు. కారును ఒక చోట వదిలేశాడు. నంబర్ ప్లేట్, వెనుక అద్దంపై ఉన్న శివసేన స్టిక్కర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేసిన మిహిర్ షా పరారీలో ఉన్నాడు.
మరోవైపు ఈ ప్రమాదంపై ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో నిందితుడు మిహిర్ షా అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఇంటితోపాటు పాల్ఘడ్, రాయ్‌గఢ్, పూణే, ఇతర ప్రాంతాల్లో వెతికారు. అతడి తండ్రి, శివసేన నేత రాజేష్ షా, కుటుంబ డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిదావత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే నిందితుడు మిహిర్ షా కోసం సోమవారం లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.