న్యూఢిల్లీ, మార్చి 20: నియోజవకర్గాల పునర్విభజన ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తూ టీ-షర్ట్లతో సభకు వచ్చిన డీఎంకే సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. అలా రావడం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. వెంటనే బయటకు వెళ్లి సరైన దుస్తులు ధరించి వచ్చి సభా గౌరవాన్ని కాపాడాలని కోరారు. నియోజక వర్గాల పునర్విభజనపై చర్చ జరపాలన్న డీఎంకే సభ్యులు డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు.
డీఎంకే ఎంపీలు ‘న్యాయబద్ధంగా పునర్విభజన కావాలి, తమిళనాడు పోరాడుతుంది.. విజయం సాధిస్తుంది’ అన్న నినాదాలున్న టీ షర్టులు ధరించి ఉభయ సభలకు హాజరయ్యారు. డీఎంకే ఎంపీలు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోను అదే పరిస్థితి కన్పించింది.
అంతకుముందు కొందరు సభ్యులతో సమావేశమైన రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఎంపీలు తమకు సహకరించాలని కోరారు.