శాక్రమెంటో: కుష్టువ్యాధి జటిలమైంది. మనిషి శరీరాన్ని మెల్లమెల్లగా తినేసి జీవచ్ఛవాన్ని మిగిలిస్తుంది. వేళ్లు ఊడిపోతాయి. పక్షవాతం వస్తుంది. అంధత్వమూ కమ్మేస్తుంది. కానీ ఆ వ్యాధిని కలిగించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం లెప్రేను ఉపయోగించుకొని ఎన్నో కీలకమైన వైద్య ఆవిష్కరణలు చేయొచ్చని అంటున్నారు ఎడిన్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి కాలేయాన్ని పెంచవచ్చని, వృద్ధాప్య లక్షణాలను వెనుకతట్టు పట్టించి పునర్ యవ్వనాన్ని ప్రసాదించవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జంతువుల్లో ఈ బ్యాక్టీరియా అనుకూల ఫలితాలను కూడా ఇచ్చింది. ఆర్మడిల్లో మీద జరిపిన ప్రయోగాల్లో ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కాలేయం రెట్టింపు స్థాయికి ఎదిగి ఆరోగ్యకరమైన మార్పులు వచ్చాయి. అయితే, మనుషుల మీద ప్రయోగాలు ఇంకా మొదలుపెట్టలేదు. వ్యాధి కలిగించకుండా చూసేందుకు బ్యాక్టీరియాలో ఎన్నో జన్యుపరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా నేరుగా కాలేయం మీదకు వెళ్లి దాని సైజును పెంచే పనిలో పడుతుంది. అయితే, ఇది ఏదో మేలు చేయడానికి కాదు. తనకు మేతను పెంచుకోవడానికే అలా చేస్తుంది. కాకపోతే అది తర్వాత హానికరంగా మారకుండా చూడాలి. మనుషుల కాలేయాలను బాగు చేసేందుకు, వృద్ధాప్య లక్షణాలను తగ్గించి శరీరాన్ని పటుత్వపరిచేందుకు ఈ బ్యాక్టీరియాను ఉపయోగించుకుంటే బాగుంటుందని ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తల ఆలోచన.