న్యూఢిల్లీ: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(Nuclear Capable Ballistic Missile)ని .. భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. జలాంతర్గామి నుంచి ఆ క్షిపణిని పరీక్షించారు. సుమారు 3500 కిలోమీటర్ల దూరం ఆ మిస్సైల్ ప్రయాణించగలదు. ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్‌మెరైన్ నుంచి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించారు.
కే-4 మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత్ తెలిపింది. అయితే ఈ మిస్సైల్ వ్యవస్థకు చెందిన మరిన్ని పరీక్షలను నేవీ నిర్వహించనున్నది. భారత నౌకాదళంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన.. ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాట్ జలాంతర్గాములు ఉన్నాయి. ఆ రెండు సబ్మెరైన్ల నుంచి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించవచ్చు.
అరిఘాట్ సబ్‌మెరైన్‌ను ఆగస్టులో జలప్రవేశం చేశారు. విశాఖపట్టణంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో ఆ జలాంతర్గామి జలప్రవేశం చేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మూడవ జలాంతర్గామి వచ్చే ఏడాది నేవీ దళంలో చేరనున్నది.